
సందీప్ కిషన్ హీరోగానే కాదు, నిర్మాతగా కూడా రాణించాలని ట్రై చేస్తున్నాడు. తాను హీరోగా చేసిన ‘గల్లీ రౌడీ’ విడుదలకు సిద్ధంగా ఉండగా, నిర్మాతగా చేసిన ‘వివాహభోజనంబు’ సినిమా రేపటి నుంచి ‘సోనీ లివ్’ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో కమెడియన్ సత్య హీరోగా పరిచయమవుతున్నాడు, ‘ఆర్జావి’ అనే కొత్త అమ్మాయి కథానాయికగా తెలుగు తెరకి పరిచయం కానుంది.
జీవితాన్ని చాలా పొదుపుగా, అదుపుగా గడుపుతున్న హీరో పెళ్లి చేసుకుంటాడు. బంధువులంతా తన ఇంట్లో ఉన్నప్పుడు లాక్ డౌన్ పడుతుంది. అప్పుడు వాళ్లందరి ఖర్చును భరించలేక, అక్కడి నుంచి పంపించే మార్గం లేక హీరో నానా తంటాలు పడుతుంటాడు. అదే సమయంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఠారెత్తి పోతాడు.
ఇలా లాక్ డౌన్ సమయంలో కొత్తగా పెళ్లైన ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలాంటి తిప్పలు పడ్డాడనే కథతో ఈ సినిమా నడుస్తుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని సందీప్ కిషన్ చెబుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ గెస్టు రోల్ లో కనిపించనున్నాడు.