
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు పసందుగా మారాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు.. ఎత్తులు పైఎత్తులతో దూసుకుపోతున్నారు. విందు రాజకీయాలతో పోటీని ఆసక్తికరంగా మార్చేశారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. మంచు విష్ణు కూడా తగ్గేదే లేదంటున్నారు. మూడు రోజుల క్రితం ప్రకాశ్‌రాజ్ గణపతి కాంప్లెక్స్ ప్రాంతంలోని చిన్న కళాకారులను కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. తనను గెలిపిస్తే.. మీ కష్టాలను తీరుస్తానంటూ హామీలు గుప్పించి వెళ్లారు. ఆ తర్వాత ఓ ఫంక్షన్ హాల్లో నటీ నటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లంచ్ మీట్ పేరుతో విందు రాజకీయాలకు తెరతీశారు. తనను, తన ప్యానల్ ను గెలిపిస్తే.. రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.
మరో వైపు మంచు విష్ణు కూడా ప్రచారంలో జోరు పెంచారు. సోమవారం రాత్రి ‘మా’ సభ్యులతో విందు సమావేశం నిర్వహించారు. పార్క్ హయత్ హోటల్లో జరిగిన ఈ భేటీలో.. ‘మా’ అభివృద్ధిపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నట్లు తెలుస్తోంది. తన భవిష్యత్ కార్యాచరణను సభ్యులకు వివరించినట్లు సమాచారం. అయితే.. తన ప్యానెల్ ను ఇంకా బయటపెట్టని ఆయన.. అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విష్ణు.. మ్యానిఫెస్టోకు కూడా తుది మెరుగులు దిద్దుతున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక.. ఒకేసారి ప్యానెల్ ను ప్రకటించడంతో పాటు మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 10న ఎన్నికలు జరగనుండడంతో.. ఇరు వర్గాలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. ప్రచారంలో వేడి పెంచుతున్నాయి.