
‘సోగ్గాడే చిన్ని నాయనా’ తర్వాత విజయం రుచి చూడని నాగార్జున.. ఆ సినిమా సీక్వెల్ తో మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అది సెట్స్ పై ఉండగానే ‘బంగార్రాజు’ను పట్టాలెక్కించేశాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన తనయుడు నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. చైతూకు జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా.. నాగార్జున సరసన మళ్ళీ రమ్యకృష్ణే కథానాయికగా నటిస్తోంది. వీళ్లిద్దరితో పాటు ‘బిగ్ బాస్ 4’ ఫేమ్ మోనాల్ గజ్జార్ కూడా బంగార్రాజు మూవీలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఇందులో ఆమెపై కొన్ని సన్నివేశాలతో పాటు ఒక ఐటెమ్ సాంగ్ కూడా చిత్రీకరిస్తారట.
వీళ్లతో పాటుగా ఇందులో మరో ఇద్దరు భామలు కూడా తళుక్కున మెరవనున్నారట. వేదిక, మీనాక్షి చౌదరిలు కూడా ఇందులో ప్రత్యేకపాత్రల్లో నటిస్తున్నారట. వీరిద్దరూ త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి. సో.. నాగార్జునను మళ్లీ మన్మథుడిగా చూడబోతున్నామన్న మాట!