
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 10న మా ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ జరుగనుంది. ‘మా’ ఎన్నికలలో ఎనిమిది మంది ఆఫీస్ బేరర్స్, 18 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల కోసం జరిగే ఈ ఎన్నికలకు ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ ఉపసంహరణకు వచ్చే నెల 1-2 తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. నామినేషన్ దరఖాస్తుకు రూ.100, ఓటర్ల జాబితా కావాలంటే రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఆఫీస్ బేరర్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు రూ.15వేలు, ఈసీ మెంబర్ రూ.10వేలు డిపాజిట్(నాన్ రిఫండబుల్)చేయాల్సి ఉంటుంది. నామినేషన్లు సమర్పించే సమయంలో అవసరమైతే అభ్యర్థులు తమ గుర్తింపు కార్డులను చూపాల్సి ఉంటుంది. పోలింగ్ తేదీ రోజున ప్రతి ఒక్కరూ తమ గుర్తింపు కార్డుతో రావాల్సి ఉంటుంది.
మార్గదర్శకాలివే…
- ఒక అభ్యర్థి ఒకే పదవికి మాత్రమే పోటీ చేయాలి.
- గత కమిటీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయి ఉండి, 50 శాతం కన్నా తక్కువ ఈసీ మీటింగ్‌లకు హాజరు కాకపోయి ఉంటే పోటీ చేసేందుకు అనర్హులు.
- 20 శాఖల అసోసియేషన్లలో ఆఫీస్ బేరర్స్‌గా ఉన్న వారు ఆ పదవులకు రాజీనామా చేయకపోతే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.
- సీనియర్ సిటిజన్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం.
- ఓటు వేయడానికి వచ్చే సభ్యులు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలి.
- నామినేషన్ సమర్పణ, ఓటు వేసే సమయంలో మాస్క్‌లు ధరించి రావాలి.
- పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు.