
హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అన్ని పార్టీలు తమ తమ రాజకీయ వేడిని చూపిస్తున్నాయి. ఎవరికి వారే గెలుపు మాదంటే మాది అనే ధీమాతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మణికం ఠాగూర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈసీ తనకున్న స్వతంత్రతను కోల్పోయిందని దుయ్యబట్టారు.
అధికారంలోకి వస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన టీఆర్ఎస్… ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటికొక నిరుద్యోగి ఉన్నాడని చెప్పారు. ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. ఈ నెల 30న హూజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.