
హోరాహోరీగా సాగుతున్న ‘మా’లో కనీసం వెయ్యి ఓట్లు కూడా లేవు. కేవలం 900 లోపే ఓట్లున్నాయి. వారిలో సగానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోరు. మహా అయితే, నాలుగు వందల మంది ఆర్టిస్టులు ఓటేసే అవకాశం ఉంది. అందులోనూ టాలీవుడ్ టాప్ హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి వారు ఈ ఎన్నికల వైపు కన్నెత్తి కూడా చూడరు. ప్రచారానికి గానీ, ఓటింగ్‌కు కానీ చాలా దూరంగా ఉంటారు. హీరోయిన్ల పరిస్థితి కూడా దాదాపుగా అంతే.
కళామతల్లి ముద్దుబిడ్డలం .. మేమంతా ఒకే కుటుంబమని ఎన్ని రకాల స్టేట్మెంట్స్ ఇచ్చినా, మాటలకు చేతలకు మాత్రం పొంతన కుదరడం లేదు. పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ, ఇరువర్గాల మధ్య మాటలు, వాదనలు పెరుగుతున్నాయి. సభ్యుల మధ్య ఆవేశాలు హద్దులు దాటుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు కూడా జోరందుకున్నాయి. ప్రకాష్‌రాజ్ తరపున మెగా కాంపౌండ్ పావులు కదుపుతుంటే, మంచు విష్ణు కోసం ఆర్టిస్ట్ నరేష్ అంతా తానై వ్యవహరిస్తున్నారు. పోలింగ్ గడువు సమీపించేకొద్దీ రకరకాల ట్విస్ట్‌లతో సాగుతున్న మా ప్రచారం… పోలింగ్ నాటికి ఎన్ని మలుపులు తిరగనుందో అని సినీ అభిమానులు నిట్టూరుస్తున్నారు.