
గొడవలు, మాటకు మాట, దొంగ ఓట్లు వేస్తున్నారంటూ .. ఇలా ఆద్యంతం ఉత్కంఠ మధ్య మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ ( ‘మా’) ఎన్నికలు సాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 580 మంది ఓటు హక్కు వినియోగించుకోగా.. ఇంకా 100 మంది క్యూలో నిలుచొని ఉన్నారు. దీంతో మూడు గంటల వరకు పోలింగ్ ప్రక్రియను పొడిగించారు. క్యూలో నిలుచున్న వారంతా ఓటు వేశాక కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కొద్దిసేటి క్రితమే అక్కినేని అఖిల్ వచ్చి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాగా, అంతకుముందు ఉదయం నుంచి ఎన్నికల కేంద్రం వద్ద హై టెన్షన్ డ్రామా నెలకొంది. ఉదయాన్నే ఓటు వేయడానికి వచ్చిన మోహన్ బాబు.. అక్కడే ఉన్న నటుడు బెనర్జీపై మండిపడ్డారు. చంపేస్తాను.. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలోకి ప్యానల్ సభ్యులు కాకుండా వేరే వ్యక్తి లోపలికి రావడంతో గందరగోళం ఏర్పడింది. పోలింగ్ కేంద్రంలోకి బయటి వ్యక్తి రావడంపై విష్ణు ప్యానల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అదేవిధంగా ప్రకాశ్‌రాజ్ గన్‌మెన్ లోపలికి రావడాన్ని మంచు విష్ణు వ్యతిరేకించారు. దీంతో పోలింగ్ అధికారులు ప్రకాశ్‌రాజ్ గన్‌మెన్ ను బయటకు పంపారు. ఆ తర్వాత జరిగిన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో నటుడు శివబాలాజీతో సీనియర్ నటి హేమ గొడవకు దిగారు. ఒక సందర్భంలో సహనం కోల్పోయిన ఆమె.. శివబాలాజీ చేయి కొరకడం కలకలం రేపింది. తాను సరిగ్గా గమనించలేదని, తన ఎడమ చేతి భుజంపై పంటి గాట్లు పడ్డాయని ఆయన తెలిపారు. అయితే, తనపై శివబాలాజీ చేతులు వేయడం వల్లే తాను కొరికానని హేమ చెప్పారు.
ఉదయం నుంచి కొందరు పిచ్చికుక్కల్లా వాగారని, ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ అద్భుత మెజారిటీతో గెలవబోతుందని నరేష్ స్పష్టం చేశారు. తమ వాళ్లను కొట్టడం కాదని, తనపై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. ఈ సారి 600 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఏదేమైనా సాయంత్రం 5 గంటల తర్వాత నిర్వహించనున్న ఓట్ల లెక్కింపులో తదుపరి మా అధ్యక్షుడు ఎవరన్నది తేలిపోనుంది.