
కాంగ్రెస్ లో రాజుకున్న వివాదానికి మంత్రి కేటీఆర్ మరింత ఆజ్యం పోస్తున్నారు. శశిథరూర్ ను ఉద్దేశించి.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గాడిద అని వ్యాఖ్యానించడం, అది అధిష్ఠానం వరకూ వెళ్లడం తెలిసిందే. చివరకు రేవంత్ క్షమాపణ చెప్పడంతో ఆ విషయం అక్కడితో ముగిసినా.. కేటీఆర్ దాన్ని వదలడం లేదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలైతే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడ్డ గాడిదా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రేవంత్ దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్ప ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సీఎంను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసులు పెట్టడానికి వెనకాడమని హెచ్చరించారు. తెలంగాణకు నిజమైన ముక్తి రాష్ట్రం ఏర్పడటంతోనే జరిగిందని తెలిపారు. బీజేపీకి సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదని, ఆనాడు సాయుధ పోరాటం చేసింది కమ్యునిస్టులేనని కేటీఆర్ గుర్తు చేశారు.
అలాగే, రేవంత్ అంతర్గత వ్యాఖ్యలను లీక్ చేసింది సుపారీ జర్నలిస్టు అయి ఉంటారంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలపైనా ట్విటర్ లో కేటీఆర్ ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్ష పదవిని సుపారీ తీసుకుని అమ్ముకున్న సంగతేంటని నిలదీశారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని.. స్వయంగా మీ పార్టీ ఎంపీనే చెప్పారంటూ సంబంధిత వార్తా కథనం క్లిప్ ను పోస్టు చేశారు. జర్నలిజాన్ని అవమానించేలా మాట్లాడడం సిగ్గు చేటని మండిపడ్డారు.