
వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ)తో హైదరాబాద్ పరిధిలో రోడ్ల దశను మార్చేశామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా పరిణమించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామని చెప్పారు. అసెంబ్లీలో సోమవారం పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఈ పథకం కింద ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ, బాలానగర్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేశామని తెలిపారు. తొలిదశలో సుమారు రూ.2000 కోట్లతో 22 ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కొత్తగా రూ.1545 కోట్లతో మరో 6 ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ఓఆర్ఆర్ అవతల 2 కిలోమీటర్ల మేర పరిధి దాకా హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్(హెచ్ యూఏ) పేరిట అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. శివారు ప్రాంతాల్లోని 25 కార్పొరేషన్ల పరిధిలో తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.1200కోట్లు కేటాయించిచనట్లు చెప్పారు. రూ.3866కోట్లతో ఎస్టీపీల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 132 లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండగా.. 24 రోడ్లను పూర్తి చేశామని వివరించారు. నాలాల అభివృద్ధికి రూ.850కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. లాక్ డౌన్ కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకుని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టులను పూర్తి చేశామని అన్నారు.