
తెలంగాణలోని సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఇప్పటికే ఏడుసార్లు లేఖలు రాసినా ఎటువంటి స్పందన లేదని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. వ్యక్తిగతంగా సమావేశమైనప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తు చేసినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ చేనేత రంగానికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదన్నారు.
40 శాతం ఇన్ ఫుట్ సబ్సిడీ వేజ్ కాంపెన్సేషన్ స్కీమ్, థ్రిఫ్ట్ ఫండ్ తదితర పథకాలతో చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కు మంత్రి కేటీఆర్ ఈ మేరకు లేఖ రాశారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం కింద సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని ఆయన లేఖలో కేటీఆర్ కోరారు. మెగా పవర్ లూమ్ క్లస్టర్‌కు కావాల్సిన నిపుణులైన కార్మికులు, వనరులు సిరిసిల్లలో పుష్కలంగా ఉన్నాయని లేఖలో వివరించారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా రాయితీలతో పాటు బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తుందని తెలిపారు.