
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబరు 2వ తేదీ నుంచి టీఆర్ఎస్ జెండా పండగ నిర్వహించనున్నట్టు మంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీల నియామకం చేపట్టనున్నట్టు ప్రకటించారు. సెప్టెంబరు నెలాఖరుకు అన్ని కార్యవర్గాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో 1,400 బస్తీల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సోషల్ మీడియా ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని, కార్యకర్తలు, కమిటీలు ధృడంగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆయా కమిటీలకు శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణం గురించి ప్రస్తావించారు. సెప్టెంబరు 2న టీఆర్ఎస్ భవన నిర్మాణం నిమిత్తం సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని చెప్పారు. తెలంగాణ భవన్ కంటే ఉన్నతంగా ఢిల్లీలో తమ పార్టీ భవనం నిర్మిస్తామని అన్నారు.
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దిక్కులేక పక్క పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని దిగుమతి చేసుకుని పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. ‘‘చంద్రబాబు నాయుడి తొత్తు, బినామీని తెచ్చుకుని వాళ్లు ఆ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. ఓ కేసులో.. డబ్బుల సంచులతో దొరికిపోయినోడిని పట్టుకుని అధ్యక్షుడిని చేసుకున్నారు. ఆయన (రేవంత్ రెడ్డి) ముఖ్యమంత్రి మీద పెద్దపెద్ద మాటలు మట్లాడతాడు! మల్లారెడ్డి నియోజకవర్గానికి పోయి నోటికొచ్చినట్టు రేవంత్ రెడ్డి ఆయనను తిట్టాడు. రాజకీయాల్లో సంస్కారవంతంగా మాట్లాడటం చాలా ముఖ్యం..’ అని కేటీఆర్ పేర్కొన్నారు. రేపటి నుంచి ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభించనున్న బండి సంజయ్ పైనా కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ యాత్ర ఎందుకు చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. గత ఏడాది హైదరాబాద్ లో వరదలొస్తే ఆదుకోవాల్సిన కేంద్రం మొండి చెయ్యి చూపించిందని ఈ యాత్ర ద్వారా ప్రజలకు చెబుతారా? అయినా కూడా సిగ్గులేకుండా ఈ యాత్ర చేస్తాం, ఆశీర్వదించండి అని ప్రజలను అడుగుతారా? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.