
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్‌ఛుగ్, బీజేపీ నేతలు డీకే అరుణ, విజయశాంతి, అరుణ్‌సింగ్, లక్ష్మణ్‌తో కలిసి బండి సంజయ్ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పాదయాత్రతో సీఎం కేసీఆర్ కుర్చీ కదలడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించాలని, సంజయ్ పాదయాత్రకు తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని కోరారు. తెలంగాణలో ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని విమర్శించారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయలేదని ధ్వజమెత్తారు. దళితులకు, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా, సామాజికంగా అన్యాయం చేస్తోందని, తెలంగాణలో గిరిజనుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ‘బంగారు తెలంగాణ’ కాలేదు కాని కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం ‘బంగారు కుటుంబం’ అయిందని విమర్శించారు.
బంగారు తెలంగాణ కాదు అప్పుల తెలంగాణ, మాఫియా తెలంగాణగా రాష్ట్రాన్ని మార్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేలాది కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు. ‘‘ఈ రాష్ట్రంలో రెండు కుటుంబాలు తెలంగాణను శాసిస్తున్నాయి. ఒకటి..ఎంఐఎం పార్టీ ఒవైసీ కుటుంబం. మరొకటి.. కల్వకుంట్ల కుటుంబం…’ అంటూ కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.