
జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ సిఎంగా అధికారం చేపట్టాక ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చారు. అయితే, కొందరు వాలంటీర్లు సీఎం జగన్ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని ధర్మవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వాలంటీర్ల అవినీతి మితి మీరిందని అన్నారు. అవినీతికి పాల్పడిన 267 మంది వాలంటీర్లను ధర్మవరం నియోజకవర్గంలో తొలగించామని వెల్లడించారు. కరోనా సమయంలో ప్రజాప్రతినిధులు బయటికి రాని సమయంలో వీరు ఇదే అదనుగా అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు.
గ్రామ సచివాలయాల్లో అవినీతికి పాల్పడిన 10 మందికి మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. పథకాల అమలులో డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని వాలంటీర్ల ను హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వాలంటీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.