
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో అధికార టీఆర్ఎస్ జోరు పెంచింది. ముఖ్యనేతలంతా అక్కడే మకాం పెట్టారు. నియోజకవర్గ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముందు నుంచే ఆ పనిలో నిమగ్నమైన టీఆర్ఎస్.. ఈసారి పదునైన అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ట్రబుల్ షూటర్ హరీశ్ రావు ముందు నుంచే.. విజయానికి క్షేత్రస్థాయిలో తీవ్ర కృషి చేస్తోంటే.. ఇక చివరగా గులాబీ బాస్ రంగంలోకి దిగనున్నారు.
పోలింగ్ ఈ నెల 30న జరగనుండగా సీఎం కేసీఆర్ 26 లేదా 27న సభ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక జరిగే పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిన్న తన నివాసంలో మంత్రులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు.
హుజూరాబాద్ లో ఉన్న మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కేసీఆర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. సభపై ఆంక్షలున్నందున దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నికల నిబంధనలు అనుసరించి నియోజకవర్గంలోనే రోడ్‌షో లు నిర్వహించాలనే అంశం చర్చకు వచ్చింది. ఈ నెల 26, 27 తేదీల్లో రెండు రోజులపాటు రోడ్ షోలు నిర్వహించాలని మంత్రులు కోరగా… సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.