
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల పై విరుచుకు పడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే , ప్రతిపక్షాలు అంతా ప్రభుత్వం పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని పంచాయతీలకు నిధులు విడుదల చేయడం లేదని, పనులు చేసిన సర్పంచ్ లు బిల్లులు రాక ఆగమవుతున్నారని, దీనిపై సమాధానం చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు శాసన సభలో శుక్రవారం సీఎం సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని సర్పంచ్ ల తీరు అమోఘంగా ఉందని, చాలా గౌరవంగా బతుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామాలకు అనేక అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. సర్పంచ్ లు ఎక్కడ ఆగమయ్యారు? అని ప్రశ్నించారు. అనేక రాష్ట్రాలు.. తెలంగాణలోని గ్రామాల పని తీరును పరిశీలించి వెళ్తున్నాయని చెప్పారు. జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త డైరెక్టర్ నిన్న ఆదిలాబాద్ ను సందర్శించాలని, ఈ రోజు కామారెడ్డిలోని పలు గ్రామాలను పరిశీలించనున్నారని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో తలసరి గ్రాంట్ విడుదల రూ.4గా ఉంటే.. తమ పాలనలో దాన్ని రూ.650కి పెంచామని గుర్తు చేశారు. తాము ఏం చేసినా పారదర్శకంగానే చేస్తున్నామని పేర్కొన్నారు. ఏది పడితే అది మాట్లాడడం మంచిది కాదని హితవు పలికారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం తమ పని కాదని వ్యాఖ్యానించారు. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ఒక రోజు సమయం కేటాయించాలని స్పీకర్ ను కోరారు. ప్రతి పైసాను ఎలా ఖర్చు పెట్టామో.. సభకు వివరిస్తామని, తద్వారా ప్రజలకు తెలుస్తుందని అన్నారు.