
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. 2, 3 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. దాదాపు 80 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని వెల్లడించారు. కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల విభజన ఉంటుందని అన్నారు. దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు కేసీఆర్ ప్రకటన ఊరటనిచ్చింది.
‘ఇప్పటి వరకు 1, 51,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాము. 1,31,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఉద్యోగాలు పొందిన వారి జాబితా త్వరలోనే అసెంబ్లీకి ఇస్తాం. రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు స్టార్ట్ అవుతాయి. నాకున్న అంచనా మేరకు 70 వేల వరకు ఉద్యోగాలు రాబోతున్నాయి. రాష్ట్రంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకూ దళితబంధు వర్తింపచేస్తాం’ అన్నారు కేసీఆర్. ‘రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం తెరాసకు రావొచ్చు. కేంద్రంలో తెరాసకు పాత్ర దొరికే అవకాశం కావచ్చు. ప్రధానికి మారెడు కాకుంటే బారెడు దరఖాస్తులు ఇస్తాం. కేంద్రం సహకరిస్తే ఇంకా బలంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తాం…’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.