
దేవి నవరాత్రులు, దసరా సందర్భంగా రోజు దుర్గమ్మ దర్శనానికి ముప్పై వేల మంది భక్తులను అనుమతిస్తామంటూ చేసిన ప్రకటనపై దుర్గ గుడి అధికారులు వెనక్కి తగ్గారు. కొవిడ్ హెచ్చరికల నేపథ్యంలో ఆలయంలో దర్శనాల సంఖ్యను కుదిస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అక్టోబర్ 7 నుంచి 15 వరకు నిర్వహించనున్న దేవి నవరాత్రులు, దసరా బ్రహ్మోత్సవాల్లో రోజుకు పదివేల మంది భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉచిత దర్శనం స్లాట్ బుకింగ్‌లో జీరో మనీతో ఎదురవుతున్న పలు లోపాలను అధికారులు గుర్తించారు. ఉచిత దర్శనానికి బదులుగా భక్తులు ఒక్క రూపాయి చెల్లించి స్లాట్ బుక్ చేసుకునేలా చర్యలు చేపట్టారు. దేవస్థానం వద్ద దర్శనం టికెట్లు తీసుకునే అంశంపై వచ్చే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. భవానీ దీక్ష చేపట్టి స్వామి దర్శనానికి వచ్చే భక్తులను కేవలం దర్శనానికి మాత్రమే అనుమతిస్తామని, ఇరుముడులు సమర్పించడానికి ఎలాంటి ఏర్పాట్లూ చేయడం లేదని అధికారులు తెలిపారు.