
కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెర కెక్కుతూ ఆగిపోయిన చిత్రం ‘ఇండియన్ 2’. ఈ సినిమా నిర్మాణ సంస్థకు, డైరెక్టర్ శంకర్ కు మధ్య వివాదం తలెత్తడంతో షూటింగ్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం ఓ కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సమస్య కోర్టు బోనులో ఉంది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి ఇరు వర్గాలు ప్రయత్నించాలని కోర్టు సూచించింది. ఆ విధంగా చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఇండియన్-2’ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది.
ఈ పరిస్థితుల్లో సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్టు కమల్ హాసన్ ఇటీవల ప్రకటించాడు. కమల్ చొరవతో దర్శకుడు శంకర్, లైకా సంస్థ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై త్వరలోనే ఇరు వర్గాలు కలిసి ఒక అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రామ్ చరణ్ తో తీస్తున్న చిత్రంతో పాటు, ‘అన్నియన్’ హిందీ రీమేక్ ను శంకర్ తెరకెక్కించడానికి కూడా లైకా ప్రొడక్షన్ అభ్యంతరం పెట్టకుండా ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. ‘ఇండియన్-2’ చిత్రం ఇప్పటికే 65 శాతం మేరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కమల్ ప్రస్తుతం లోకేశ్ కనగ్రాజ్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే సినిమా చేస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతున్న ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ కూడా నటిస్తున్నారు.