
కోలీవుడ్ ప్రముఖ నటి జ్యోతిక.. స్టార్ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నాక కూడా సందేశాత్మక, సామాజిక సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. అయితే సోషల్ మీడియాకు మాత్రం దూరంగానే ఉంటోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసిందామె. హిమాలయాల టూర్ చేసిన ఆమె.. అక్కడ దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అడ్వెంచర్ ట్రిప్‌కు వెళ్లిన జ్యోతిక.. త్రివర్ణ పతాకంతో తనలో ఉన్న దేశభక్తిని చాటింది. కశ్మీర్‌లోని సుందర సరస్సుల మధ్య తన టీమ్‌తో దిగిన కొన్ని ఫోటోలనూ షేర్ చేసింది. బికాత్ అడ్వెంచర్స్ టీమ్‌లోని సభ్యులతో జ్యోతిక హిమాలయ అందాలను తిలకించింది. హలో ఎవిరివన్ అంటూ తన పోస్టులో పేర్కొన్న జ్యోతిక.. తన లాక్డౌన్ డెయిరీల్లోంచి కొన్ని పాజిటివ్ అంశాలను పోస్టు చేస్తున్నట్లు చెప్పింది.
జీవితం వాస్తవికమైనదని, కానీ జీవించడం ప్రారంభించాకే ఆ విషయం తెలుస్తుందన్న ఉద్దేశాన్ని ఆమె తన పోస్టులో పేర్కొన్నది. ఆమె దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఆ పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే 1.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. జ్యోతిక మొదటి పోస్ట్ కు 269,155 లైక్‌ల వర్షం కురిసింది. ఆమెకు సోషల్ మీడియాలోకి స్వాగతం చెబుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జ్యోతిక భర్త సూర్య సైతం ఆమె సోషల్ మీడియా ఎంట్రీపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘నిన్ను ఇన్‌స్టాలో చూసినందుకు థ్రిల్ అయ్యాను!’ అంటూ ఫోటో షేరింగ్ యాప్‌లో ఆమె అరంగేట్రంపై కామెంట్ చేశాడు.