
ఏపీలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాల్సిందిగా పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. ‘‘పెట్టుబడులతో రండి.. సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ఆహ్వానం పలికారు. కేంద్ర ప్రభుత్వ ‘ఆజాదీ కా మహోత్సవ్’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో రెండు రోజుల పాటు జరిగే వాణిజ్య ఉత్సవ్ ను మంగళవారం ఆయన విజయవాడలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా రెవెన్యూ ఆదాయం 32.38 శాతం పడిపోయింది. ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం.. 19.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. రాష్ట్రం నుంచి ఎగుమతులు 14.1 బిలియన్ డాలర్ల నుంచి 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఎగుమతుల్లో దేశంలో 9వ స్థానంలో ఉండే రాష్ట్రం.. గడచిన రెండేళ్లలో సాధించిన ప్రగతితో 4వ స్థానానికి చేరుకుంది. ఓ ప్రణాళికతో ముందుకెళితే.. ఏదైనా సాధ్యమే అనే దానికి ఇదే నిదర్శనం…’’ అని జగన్ తెలిపారు.
‘‘పారిశ్రామికంగానూ రాష్ట్రం పగతి పథంలో పయనిస్తోంది. మా ప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్లలో 68 భారీ, అతి భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.30,175 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా 46,119 మందికి ఉద్యోగాలు లభించాయి. ఇవికాకుండా మరో రూ.36,384 కోట్ల పెట్టుబడితో 68 భారీ పరిశ్రమలు నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటున్నాయి. వీటివల్ల సుమారు 76,700మందికి ఉపాధి లభిస్తుంది. గత ఏడాది రూ.26,391 కోట్ల పెట్టుబడితో 10 మెగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. వీటి ఏర్పాటుతో 55,024మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’’ అని సీఎం జగన్ వివరించారు.