
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై దాఖలైన అన్ని రిట్ పిటిషన్లపైనా రోజువారీ విచారణ చేపడతామని వెల్లడించింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న పలు సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా విధించిన స్టే గడువు బుధవారంతో ముగిసింది. దీంతో తమపై నమోదైన కేసులను కొట్టేయాలని లేదా స్టే ఉత్తర్వులు పొడిగించాలని కోరుతూ వారు మరోసారి పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై రోజువారీగా విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ ధర్మాసనం తెలిపింది. ఈ రోజు నుంచి విచారణ చేపడతామని..అందుకు న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని సూచించింది.
ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించిన కేసులు త్వరగా తేల్చాలన్న సుప్రీం కోర్టు దిశా నిర్దేశం మేరకు తాజాగా హై కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టులో హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ సహా 2012నుంచి దాఖలైన మొత్తం 40 వ్యాజ్యాలను కోర్టు ఈ జాబితాలో చేర్చింది. దాదాపు రెండు నెలల పాటు ఈ వ్యాజ్యాలను కోర్టు విచారించనుంది.
వాస్తవానికి జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సీబీఐ కోర్టుకు ఒకే ఒక్క సారి హాజరయ్యారు. పలు సందర్భాల్లో న్యాయవాదులు మాత్రమే హాజరయ్యేలా ప్రత్యేక అనుమతి తీసుకున్నారు. అయితే, తాజాగా హై కోర్టు విచారణకు ఆయన హాజరవుతారా? సీఎంగా ఉన్నందున ప్రత్యక్ష హాజరుకు కోర్టు మినహాయింపు ఇస్తుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా, జగన్, విజయసాయిరెడ్డి తదితరులు దాఖలు చేసుకున్న డిశ్చార్జి పిటిషన్లపై ఈడీ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో రాంకీ కేసును నవంబరు 5కు, జగతి పబ్లికేషన్స్ కేసును నవంబరు 8కి కోర్టు వాయిదా వేసింది.