
దుబాయ్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్స్ లో ఢిల్లీపై చెన్నై విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి ఢిల్లీతో జరిగిన తొలి క్వాలిఫయర్స్ పోరులో చెన్నై గెలుపొందింది. నిర్దేశిత లక్ష్యాన్ని(173) అలవోకగా ఛేదించింది. ఢిల్లీ బౌలర్లను రాబిన్ ఉతప్ప(63) ఉతికారేశాడు. అతడికి గైక్వాడ్ (70) తోడవడంతో విజయం చెన్నైను వరించింది. ఐపీఎల్-2021లో ఫైనల్ కు చేరిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది.
173 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నైకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే.. ఓపెనర్ డూప్లెసిస్ రెండు బంతుల్లో కేవలం ఒక్క పరుగే చేసి ఔటయ్యాడు. నోర్జే బౌలింగ్ లో బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. ఈ సమయంలో అభిమానులు రుతురాజ్ గౌక్వాడ్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడే ఉతప్ప మాయచేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా క్రీజులోకి వచ్చి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా ఫోర్లు బాదేసి.. ఢిల్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచేశాడు. మరో ఎండ్ లో గైక్వాడ్.. ఉతప్పకు మంచి స్టాండ్ ఇచ్చాడు. ఇద్దరూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు కదిలించారు.
ఈ క్రమంలోనే ఉతప్ప అర్థశతకాన్ని అందుకున్నాడు. ఉతప్ప ఔట్ అయినా.. గైక్వాడ్ దూకుడు కొనసాగించాడు. ఈ క్రమంలో 50పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఉతప్ప ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దుల్ ను టామ్ కరెన్ డకౌట్ చేశాడు. తర్వాత వచ్చిన అంబటి రాయుడు(1) పెద్దగా ప్రభావం చూపించలేదు. రబాడా బౌలింగ్ లో శ్రేయర్ అయ్యర్.. రాయుడిని రనౌట్ చేశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172పరుగులు చేసింది. ఓపెనర్ షా (60), పంత్ (51*), హెట్ మయర్ (37) రాణించారు. చెన్నై బౌలర్లలో హేజిల్ ఉడ్ 2, జడేజా 1, మోయిన్ అలీ 1, బ్రావో 1 వికెట్ తిశారు.