
ఐపీఎల్ రెండో దశలో ముంబై.. వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. తొలి మ్యాచ్ లో చెన్నైతో ఓడిన ముంబై.. ఇప్పుడు కోల్ కతా చేతిలో చిత్తయింది. వెంకటేశ్ అయ్యర్ (30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53), రాహుల్ త్రిపాఠి (42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో రాణించడంతో.. కోల్ కతా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగుకు దిగిన ముంబై.. 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్లు డికాక్ (42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55), రోహిత్ (30 బంతుల్లో 4 ఫోర్లతో 33) మంచి ఆరంభాన్ని ఇచ్చినా.. తర్వాతి బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో ఆశించిన స్కోరు చేయలేకపోయింది. ఫెర్గూసన్, ప్రసిధ్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో కోల్ కతా కేవలం 15.1 ఓవర్లలోనే పని ముగించేసింది. ఈ క్రమంలో.. మూడు వికెట్లను చేజార్చుకుంది. ఈ మూడు వికెట్లూ బుమ్రాకు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నరైన్ నిలిచాడు.
లక్ష్యం చిన్నదే అయినా.. కేకేఆర్ తేలిగ్గా తీసుకోలేదు. వేగంగా పరుగులు సాధించింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, గిల్ (13) చెరో సిక్సర్ బాదారు. ఇక అక్కడి నుంచి ఏ దశలోనూ కోల్ కతా దూకుడు తగ్గలేదు. మూడో ఓవర్ లోనే గిల్ ను బుమ్రా అవుట్ చేసినా అయ్యర్ దూకుడు కళ్లెం పడలేదు. రాహుల్ త్రిపాఠి కూడా వేగం పెంచడంతో.. పవర్ ప్లేలోనే కోల్ కతా ఖాతాలో 63 పరుగులు జమయ్యాయి. ఈ క్రమంలోనే అయ్యర్.. 25 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. బుమ్రా ఓవర్ లో 6, 4తో త్రిపాఠి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అదే ఓవర్ నాలుగో బంతికి అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కానీ, అప్పటికే కేకేఆర్.. గెలుపు వాకిటకు చేరింది. 16వ ఓవర్ తొలి బంతికి రాణా బౌండరీతో కేకేఆర్ మ్యాచ్ ను ముగించింది.