
IPL లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ( Virat Kohli) ప్రస్థానం ముగిసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ( KKR) తో షార్జా వేదికగా సోమవారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయిన బెంగళూరు టీమ్.. IPL2021 సీజన్ నుంచి నిష్క్రమించింది. సీజన్ మధ్యలోనే కెప్టెన్‌గా తనకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్ అని ప్రకటించిన విరాట్ కి టైటిల్‌తో గౌరవంగా సెండాఫ్ ఇవ్వాలని ఆశించిన బెంగళూరు టీమ్.. ఎలిమినేటర్‌లో పేలవ ప్రదర్శనతో తేలిపోయింది. దాంతో.. టైటిల్ కల నెరవేరకుండానే కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. ఇకపై కూడా ఐపీఎల్లో ఆడినన్ని రోజులూ బెంగళూరు టీమ్‌కే ప్రాతినిథ్యం వహిస్తానని చెప్పుకొచ్చిన కోహ్లీ.. టీమ్‌లో ఉన్నా అది బ్యాట్స్‌మెన్‌గా మాత్రమేని స్పష్టం చేశాడు.
ఐపీఎల్లో కెప్టెన్‌గా విరాట్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే..? 2013లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ 140 మ్యాచ్‌ల్లో బెంగళూరు టీమ్‌ని నడించాడు. ఇందులో 66 మ్యాచ్‌ల్లో బెంగళూరు టీమ్ విజయం సాధించగా.. 70 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం ఫలితం తేలలేదు. ఇక 2016 ఐపీఎల్ సీజన్లో అత్యద్భుతంగా రాణించిన కోహ్లీ.. బెంగళూరు టీమ్‌ని ఒంటిచేత్తో ఫైనల్‌కి చేర్చాడు. కానీ.. టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓడిపోయింది. అలానే 2017, 2019లో బెంగళూరు టీమ్ చెత్త ప్రదర్శనతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.
కోహ్లీ సహచరులు రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోనీతో పాటు గౌతమ్ గంభీర్ కూడా ఐపీఎల్ టైటిళ్లని ముద్దాడారు. కానీ.. 2013 నుంచి 2021 వరకూ ప్రయత్నించినా.. కోహ్లీ కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయాడు. కెప్టెన్‌గా చివరికి కోహ్లీకి ఆ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.