
ఇంజమామ్ ఉల్ హక్ పాకిస్తానీ క్రికెట్ లో అత్యధిక పరుగుల వీరుడు. మంచి కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ గుండెపోటుకు గురయ్యారు.
దీంతో ఆయనను లాహోర్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేరి టెస్టులు చేశారు. అనంతరం వైద్యులు సోమవారం సాయంత్రం యాంజియోప్లాస్టి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం మాజీ కెప్టెన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గత మూడు రోజుల నుంచి ఛాతీలో నొప్పి రావడంతో, ఆయన గుండెపోటుకు గురైనట్లు తేలడంతో యాంజియోప్లాస్టి శస్త్ర చికిత్స నిర్వహించారు.
1992 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడైన ఇంజమామ్.. అత్యుత్తమ బ్యాటర్స్‌లో ఒకడిగా గుర్తింపు పొందాడు. 1991లో అంతర్జాతీయ క్రికెట్లో ఇంజమామ్ అడుగుపెట్టాడు. తన కెరీర్లో 378 వన్డేలు ఆడిన ఇంజమామ్ 11739(10 సెంచరీలు) పరుగులు చేశాడు. 120 టెస్టుల్లో 8830 పరుగులు(25 సెంచరీలు) చేశాడు. ఇక పాకిస్తాన్ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజీ గుర్తింపు పొందాడు.