
వర్షాకాలంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతారు. బయటికి వెళ్లేటప్పుడు గొడుగు తీసుకెళ్లకపోతే.. సడెన్గా వర్షం వస్తే.. తలదాచుకోవడానికి తిప్పలు పడాల్సిందే. ఆ తర్వాత ఎలాగోలా ఇంటికెళ్లిపోతాం. కానీ, వీధుల్లో ఉండే మూగ జీవాలు మాత్రం వర్షంలో తడిసి ముద్దయిపోతాయి. వర్షం వచ్చినా.. చలిపెట్టినా.. ఎండ కొట్టినా.. అలా రోడ్ల మీద బతకాల్సిందే.
ఈ నేపథ్యంలో ముంబయి తాజ్ హోటల్ ఉద్యోగి రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. ఆ ఉద్యోగి ఫొటో ఇంటర్నెట్లో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిలో ఆ వ్యక్తి భారీ వర్షంలో తడుస్తున్నఓ కుక్కకు తన గొడుగుపట్టాడు. ఈ ఉద్యోగి ఫోటోను వ్యాపార దిగ్గజం రతన్ టాటా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. ‘‘ఈ వర్షాకాలంలో వీధి జంతువులకు ఉపశమనం’’ అనే శీర్షిక పెట్టారు. ‘‘ఈ తాజ్ ఉద్యోగి చాలా దయ గలవాడు. భారీ వర్షం సమయంలో ఓ వీధి కుక్కను తడిసిపోకుండా కాపాడటానికి తన గొడుగును దానితో పంచుకున్నాడు. ముంబై లాంటి బిజీ నగరంలో అతను చేసిన పని ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అని రతన్ టాటా పేర్కొన్నారు.