
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండు కొత్త జట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. వచ్చే సీజన్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో టీంలు కూడా పాల్గొంటాయని బీసీసీఐ తెలిపింది. రెండు కొత్త జట్ల కోసం ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్ లో… అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సంస్థ సొంతం చేసుకుంది. లక్నో జట్టును ఆర్ పీఎస్ జీ గ్రూప్ దక్కించుకుంది.
లక్నో ఫ్రాంచైజీ కోసం ఆర్ పీఎస్ జీ గ్రూప్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.7 వేల కోట్లకు బిడ్ వేశారు. అహ్మదాబాద్ జట్టు కోసం సీవీసీ క్యాపిటల్ సంస్థ రూ.5 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీల చేరికతో ఐపీఎల్ లో జట్ల సంఖ్య 10కి పెరిగింది. వచ్చే సీజన్ నుంచే ఈ రెండు జట్లు పాల్గొననున్నాయి.
మొత్తం 22 కంపెనీలు రూ.10 లక్షల విలువైన టెండర్ డాక్యుమెంట్ ను దక్కించుకున్నాయి. వీటిలో కేవలం 10 కంపెనీలు మాత్రమే బిడ్డింగ్ కు దిగాయి. ఈ బిడ్డింగ్ లో బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోనే, రణ్వీర్ సింగ్ కూడా కన్సార్టియం ద్వారా పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే బిడ్డింగ్‌లో మాత్రం వారి పేర్లు వినిపించలేదు. వారు కొత్త ఫ్రాంచైజీలకు మైనారిటీ స్టేక్ హోల్డర్లు లేదా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండే అవకాశం ఉంది.
గత ఐపీఎల్ సీజన్స్‌లో కొన్ని జట్లు అలా వచ్చి వెళ్లిపోయాయి. వాటిలో దక్కన్ ఛార్జర్స్(2008-2012), కోచి టస్కర్స్(2011), పుణె వారియర్స్ (2011-2013), రైజింగ్ పుణె సూపర్ జెయింట్ (2016-2018), గుజరాత్ లయన్స్ (2016-2018) జట్లు ఆయా సీజన్స్‌లో ఆడి, ఆ తర్వాత రద్దయి పోయాయి.
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ లో పాల్గొనబోయే రెండు కొత్త జట్లను ప్రకటించింది బీసీసీఐ. ఈ నేపథ్యంలో మాట్లాడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. కొత్త జట్లతో మరింతమంది దేశవాళీ క్రికెటర్లకు అవకాశం లభిస్తుందని వెల్లడించారు. “వచ్చే సీజన్ కోసం ఎంపికైన రెండు కొత్త జట్లకు బీసీసీఐ స్వాగతం చెబుతోంది. లక్నో, అహ్మదాబాద్ పట్టణాల్లోనూ ఇకపై లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇది దేశ క్రికెట్ ఆర్థికంగా మరింత బలంగా తయారవడానికి దోహదపడుతుంది. రెండు కొత్త జట్ల చేరికతో మరికొంత మంది దేశవాళీ క్రికెటర్లకు అవకాశం లభిస్తుంది. ఐపీఎల్ 2022 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు దాదా.