
2021 టీ20 ప్రపంచకప్ ను భారత్ ఓటమితో ప్రారంభించింది. ఆదివారం రాత్రి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడి పది వికెట్ల తేడాతో ఘోర పరాభవం ఎదుర్కొంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో పాక్ వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔట్ కాదంటూ ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా ఆరు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే రీప్లేలో బౌలర్ షాహీన్ అఫ్రిది నోబాల్ వేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే దీన్ని అంపైర్ నో బాల్‌గా ప్రకటించకపోవడం పట్ల భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అంపైర్ తప్పుడు నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా మండిపడుతున్నారు. అంపైర్ నిద్రపోతున్నాడా? అంటూ నో బాల్‌కు సంబంధించిన ఫోటోను కూడా జతచేర్చుతూ ట్వీట్స్ చేస్తున్నారు.