
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది..! భారత్, పాకిస్తాన్ మధ్య ప్రపంచకప్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాదు యావత్ క్రీడాలోకం ఎదురుచూస్తుంటుంది. క్రికెట్ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరంతో దాయాది జట్లు తమ టి20 వరల్డ్‌కప్ వేటను మొదలు పెట్టబోతున్నాయి.
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో ఐదుసార్లు తలపడగా ప్రతీసారి భారత్‌నే విజయం వరించింది. వన్డే వరల్డ్‌కప్‌ను కూడా కలుపుకుంటే 12–0తో టీమిండియా తిరుగులేని ప్రదర్శన కనబర్చింది. ఆ లెక్కను సరిచేయాలనే కసితో పాక్ ఉంది. మరోవైపు తమకు అలవాటైన రీతిలోనే పాక్‌ను చిత్తు చేసి మెగాటోర్నీని ఘనంగా ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం.. ఈ హీట్‌ను మరింత పెంచుతోంది. భారత జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుత జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తుండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం కాగా.. కీలక పోరుకు ముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. మరి సంప్రదాయం కొనసాగుతుందా.. లేక సంచలనం నమోదవుతుందా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది!
ఈ బిగ్ ఫైట్‌కు టీమిండియా ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ బరిలోకి దిగడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఫస్ట్ డౌన్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రావడం ఖాయం. మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30కు ప్రారంభం కానుంది కాబట్టి మంచు కీలక పాత్ర పోషించనుంది. దీంతో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాన పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు అవకాశం దక్కనుంది. అయితే భువీని తీసుకురావాలనుకుంటే మాత్రం షమీని పక్కనపెట్టవచ్చు. ఇక ఏకైక స్పిన్నర్‌గా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకునే చాన్స్ ఉంది. అయితే అతడు ఫిట్నెస్ సమస్యలతో బాధపడితే మాత్రం తుది జట్టులోకి అశ్విన్ వస్తాడు. వీరి ధనాధన్ ప్రదర్శనతో ‘సూపర్ సన్డే’ అందరికీ ‘ఫన్డే’ కానుంది.