
కొవిడ్ తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో వివిధ దేశాలు విదేశీ ప్రయాణికుల రాకపై ఆంక్షలు సడలిస్తున్నాయి. భారతీయులు సైతం 18 దేశాల్లోని 50 నగరాలకు వెళ్లే అవకాశం లభించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి లండన్ కు నేరుగా విమాన సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ నెల 10న శంషాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు నాన్ స్టాప్ విమాన సర్వీసు బయలుదేరుతుందని పేర్కొంది. ప్రతి సోమ, శుక్రవారాల్లో ఈ సర్వీసులు నడపనుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 5.30 గంటలకు, సోమవారం తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ విమానాలు బయలుదేరనున్నాయి.
కాగా, 18 దేశాలతో కొనసాగుతున్న ఎయిర్ బబుల్ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే ప్రత్యేక విమానాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా ఆయా దేశాల్లోని సుమారు 50 నగరాలకు భారతీయులు వెళ్లొచ్చు. ఈ జాబితాలో యునైటెడ్ కింగ్డమ్(యూకే), కెన్యా, భూటాన్, ఫ్రాన్స్, అమెరికా, యూఏఈ, కువైత్, కెనడా తదితర దేశాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 30 వరకు ఈ నగరాలకు వెళ్లే విమానాల షెడ్యూల్ను రూపొందించారు. ఇప్పటికే ఈ నెల 3 నుంచి ఎయిర్ ఇండియా విమానాలను ప్రారంభించింది. ఈ నెల 7వ తేదీ నుంచి కెనడా కూడా భారతీయ ప్రయాణికుల ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. అలాగే, దుబాయ్, కువైత్, అబుధాబి కూడా భారతీయుల రాకపై నిషేధాన్ని తొలగించాయి. అయితే, ప్రయాణికులు కొవిషీల్డ్ టీకా వేసుకోవడం తప్పనిసరి. దీంతోపాటు ప్రయాణానికి 72 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ టెస్టు నెగెటివ్ సర్టిఫికెట్ చూపించాలి.