
హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్రకు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం నాడు నిర్వహించే శోభాయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. శోభాయాత్ర, విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలని సూచించారు. నిమజ్జనం పర్యవేక్షణ కోసం వివిధ శాఖల అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాలు, శోభాయాత్ర నిర్వహించే రహదారులలో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ చేపట్టేలా 8,160 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను నియమించనున్నట్లు చెప్పారు. వివిధ స్థాయిల్లోని 27,000 మంది పోలీసు సిబ్బందితో పాటు గ్రే హౌండ్స్, ఆక్టోపస్ దళాలు కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తాయని వివరించారు. సందర్శకుల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైళ్లను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్ ను కూడా ఏర్పాటు చేసినట్టు మంత్రి తలసాని తెలిపారు.
భక్తులు, గణేష్ మండళ్ల నిర్వాహకులు అధికారులకు సహకరించాలని కోరారు. విగ్రహాల నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్ పరిసరాల్లో 24 క్రేన్ లతో పాటు జీహెచ్ఎంసి పరిధిలో నిమజ్జనం కోసం గుర్తించిన నీటి వనరుల వద్ద 300 క్రేన్ లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 100 మంది గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉచడం జరుగుతుందని వివరించారు. శోభాయాత్ర నిర్వహించే రహదారులలో అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను, చెట్ల కొమ్మలను తొలగించాలని ఆదేశించారు.