
టీఆర్ఎస్ తో ఉన్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని బయటకు వచ్చిన ఈటెల.. ఒంటరయ్యారా? ఉప ఎన్నికలో చావో రేవో అన్న రీతిలో తలబడుతున్న ఆయన.. గులాబీ వ్యూహంలో చిక్కుకున్నారా? అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల.. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన.. టీఆర్ఎస్, కేసీఆర్, హరీశ్ రావులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. దీంతో.. హుజూరాబాద్ లో ఈటెల గెలిస్తే.. వ్యక్తిగతంగా తనకు, పార్టీ పరంగా టీఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన కేసీఆర్.. ఈటెలను ఎలాగైనా దెబ్బకొట్టేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా.. దళితబంధును అమల్లోకి తేవడంతో పాటు.. నియోజకవర్గంలో అనూహ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
తొలుత ఈటెలతో పాటు భారీ ఎత్తున నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారు. దీంతో.. ఓ దశలో టీఆర్ఎస్ కు అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈటెల రాజేందర్ మాత్రం నియోజకవర్గమంతా పర్యటిస్తూ.. తన బలాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఓ దశలో కేసీఆర్ చేయించిన సర్వేలోనే టీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. దీంతో అప్రమత్తమైన కేసీఆర్.. ఈటల బలంపై గురిపెట్టారు. పదవులను ఎరగా వేసి స్థానిక ఈటల వర్గ నేతలను ఒక్కొక్కరిగా తిరిగి టీఆర్ఎస్ లోకి తీసేసుకున్నారు. తనదైన రాజకీయ ఎత్తుగడలతో కేసీఆర్.. క్రమంగా టీఆర్ఎస్ బలాన్ని పెంచుకుంటూ వచ్చారు. టీఆర్ఎస్ కు చెందిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీటీసీలు, సర్పంచులు, సహకార సంఘాల నేతలు, పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నేతలు ఈ రెండు నెలల్లో ఈటలను వీడి మళ్లీ టీఆర్ఎస్ నీడన చేరారు. ఈటల సామాజిక వర్గానికి చెందిన నేతలూ ఆయనను వీడుతున్నారు. టీఆర్ఎస్ నేతలనే కాకుండా ప్రస్తుతం ఈటల పోటీ చేస్తున్న బీజేపీ నేతలను కూడా ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కటొక్కటిగా ఫలించి ఇరు పార్టీల నుంచి నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. చివరికి ఈటెల రాజేందర్ సొంత సామాజిక వర్గానికి చెందిన ముదిరాజ్ నేతలు కూడా ఆయనను వీడుతున్నారు. ఈటెల మంత్రిగా ఉన్న కాలంలో ఆయన వెంట ఉంటూ పదవులను అనుభవించిన నేతలు ఆయనను వీడి గులాబీ గూటికి చేరారు. ఈటెల రాజేందర్ ను దాదాపుగా ఒంటరిని చేసేశారు. అలాగే, స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులకు కూడా వలవేసి గులాబీ కండువా కప్పేస్తున్నారు. దీంతో ఇక్కడ బీజేపీ కూడా బలహీనంగా మారిపోయింది. కేసీఆర్ వ్యూహాలతో.. ఇంతకాలం తన వెన్నంటి నిలిచిన నాయకులు సైతం ఈ క్లిష్ట పరిస్థితిలో ఏకాకిని చేసేయడంతో.. రాజేందర్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
అప్పటికీ.. ప్రజలపైనే విశ్వాసం ఉంచిన ఈటెల రాజేందర్ .. నియోజకవర్గంలో తన పర్యటనలను ఉదృతం చేశారు. ఇంటింటికీ వెళుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అక్టోబరు తొలి వారంలోనే ఎన్నికలు ఉంటాయని భావించిన కేసీఆర్.. ఇటీవల మరోసారి సర్వే చేయించారని, అందులోనూ కొద్దిపాటి ఆధిక్యంలో నిలిచారని సమాచారం. దీంతో.. మరికాస్త సమయం ఉంటే.. ఈటెల రాజేందర్ ఆట కట్టించవచ్చని భావించిన కేసీఆర్.. ఢిల్లీలో రాజకీయం చేసి ఎన్నిక వాయిదాకు యత్నించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘమే చెప్పడం గమనార్హం. కరోనా కారణంగా ఎన్నిక వాయిదా వేయాలంటూ స్వయంగా ముఖ్యమంత్రి కోరారని, అందుకే హుజూరాబాద్ ఎన్నికను వాయిదా వేశామని సీఈసీ వెల్లడించారు. ఇదంతా గులాబీ వ్యూహంలో భాగమేనని సమాచారం. కనీసం మరో నెల సమయం ఉంటే.. ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టడం తేలికనేది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే ఒంటరయిన ఈటెలను.. ఆర్థికంగానూ దెబ్బతీసి పైచేయి సాధించాలన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. ఈలోగా హుజూరాబాద్ లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా అన్ని వర్గాల ఓటర్లనూ ఆకట్టుకోవాలనేది టీఆర్ఎస్ వ్యూహం. మరో నెల పాటు ఎన్నిక జరిగే అవకాశం లేకపోవడంతో.. ఈటల మరింత డీలా పడ్డారు. మరోవైపు టీఆర్ఎస్.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ.. రోజురోజుకీ బలం పెంచుకుంటూ.. జనాకర్షక పథకాలతో దూసుకుపోతోంది. ఈ దశలో సానుభూతినే నమ్ముకున్న రాజేందర్.. కేసీఆర్ పన్నిన గులాబీ వ్యూహాన్ని తట్టుకుని ఎంతవరకు నెగ్గుకు రాగలరో చూడాలి!