
తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ నియోజక వర్గాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హుజూరాబాద్ లో 306, బద్వేల్ లో 281 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సారి పోలింగ్ సమయాన్ని (సాయంత్రం 7 గంటల దాకా) రెండు గంటల పాటు పెంచారు. ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో కొన్ని చోట్ల పోలింగ్ ను ఆలస్యంగా ప్రారంభించారు.
హుజూరాబాద్ లో అత్యంత ఉత్కంఠ మధ్య సాగుతున్న ఉప ఎన్నికకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇందిరానగర్ లోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. మొత్తం 2,37,022 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 612 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 1750 మంది పోలింగ్ సిబ్బందితోపాటు ప్రత్యేకంగా నిఘా 15 బృందాలను నియమించారు. 3,865 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ బీజేపీ, అధికార టీఆర్ఎస్ మధ్యే పోటీ నెలకొన్నప్పటికీ 30 మంది బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
మరోవైపు, బద్వేల్ ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండగా, అధికార వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు మొత్తం 15 మంది పోటీ పడుతున్నారు. ఇక్కడ మొత్తం 2,15,292 మంది ఓటర్లు ఉండగా, 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు వేల మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు. ఉప ఎన్నికలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేశామని, పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు.