
తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో.. బద్వేలు ఎన్నిక ఏకపక్షమే కానుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ.. అది నామమాత్రమే కానుంది. అయితే.. అధికార ప్రతిపక్షాలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో.. తెలంగాణలోని హుజూరాబాద్ ఉప పోరు మాత్రం రణరంగాన్ని తలపిస్తోంది.
కేసీఆర్ తో వచ్చిన విభేదాలతో పార్టీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవగా.. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో.. ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. ఇక్కడ ఎలాగైనా గెలిచి.. కేసీఆర్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని ఈటల భావిస్తుండగా.. ఈటలను ఓడించడం ద్వారా తెలంగాణలో తనకు తిరుగులేదని నిరూపించుకునేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారు.
ఈ రెండు పార్టీలకూ క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణమున్న కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సవాల్ ఎదురవుతోంది. రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రచారం.. ఆ పార్టీకి బాగా కలిసొస్తోంది. టీఆర్ఎస్ ఆశలన్నీ దళితబంధు పథకంపైనే ఉండగా.. ఈటల మాత్రం సానుభూతినే నమ్ముకున్నారు. తనను చూసి ఓట్లెయ్యాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాగుతున్న హోరాహోరీ ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ రాత్రి నుంచే అసలైన మంత్రాంగానికి తెర లేవనుంది. ప్రచారంలో ఎవరు ఎంత ముందున్నప్పటికీ.. ఈ రెండు రోజుల మంత్రాంగంలో ఎవరిది పైచేయి అవుతుందో.. వారికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. 30న పోలింగ్ జరిగి.. నవంబరు 2న ఫలితం వెలువడనుంది.