
హుజూరాబాద్ లో తన ఆనవాయితీని కాంగ్రెస్ కొనసాగిస్తోంది. గతంలో మాదిరిగానే ప్రచార పర్వంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఒక వైపు బీజేపీ, టీఆర్ఎస్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈటల రాజేందర్, హరీశ్ రావు పరస్పరం వాగ్బాణాలు సంధించుకుంటూ ఎన్నికల వేడిని రాజేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చాక కొత్త ఊపు వచ్చిందని చెప్పుకొంటున్న తరుణంలో కాంగ్రెస్ ఇలా వ్యవహరించడానికి కారణమేంటి? ఇది కూడా వ్యూహంలో భాగమేనా? హుజూరాబాద్ లో కాంగ్రెస్ ప్రణాళిక ఏంటి?.. ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియక కాంగ్రెస్ శ్రేణులు డీలా పడుతున్నాయి.
మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. తొలుత కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. ఈ విషయమై రాష్ట్ర నేతలు కొందరు మంతనాలు జరిపినా.. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తో దానికి తెరపడింది. దీంతో తనను తాను కాపాడుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఈటల బీజేపీలో చేరిపోయారు. ఉప ఎన్నిక ఖరారైన తర్వాత బీజేపీ, టీఆర్ఎస్.. స్పీడ్ పెంచాయి. టీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్.. హరీశ్ రావుకు మొత్తం బాధ్యతలు అప్పగించారు. ఈటల రాజేందర్ సైతం తనను చూసి ఓటు వేయాలని, కేసీఆర్ తనకు ద్రోహం చేశారని ప్రచారం చేసుకుంటున్నారు.
ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యాక అనేక తర్జనభర్జనల మధ్య ఎట్టకేలకు అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించింది. కొండా సురేఖ వెనకడుగు వేయడంతో ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను బరిలోకి దింపింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ఆయనతో హడావుడిగా నామినేషన్ వేయించింది. ఈ కార్యక్రమానికి రేవంత్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఆ తర్వాత ఏ ఒక్కరూ హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. ఉప ఎన్నికకు మరో 12 రోజులే గడువు ఉంది. అంటే 10 రోజుల్లో ప్రచారం ముగియనుంది. ఇప్పటికీ రేవంత్ సహా ఏ ఒక్కరూ అక్కడ ప్రచారం చేయలేదు. చివరకు ఆ పార్టీ అభ్యర్థి కూడా నామమాత్రంగానే తిరుగుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ముఖ్య నేతలుగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సైతం అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. సోమవారం నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ ప్రచారం చేస్తారని ప్రకటించినా.. ఆయన వెంట ఎవరెవరు ఉంటారన్న దానిపై స్పష్టత రాలేదు.
అయితే, ప్రచారం చేయకపోవడమూ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉప ఎన్నికలో గెలుపు సంగతి పక్కన పెడితే.. టీఆర్ఎస్ ను ఓడించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇది పరోక్షంగా ఈటలకు సహకరించేందుకేనన్న వాదన వినిపిస్తున్నారు. అలాగే, టీఆర్ఎస్ మాదిరిగానే విద్యార్థి సంఘం నేతనే బరిలోకి దింపడంలోనూ మరో కోణం ఉంది. విద్యార్థి నేతగా గెల్లు శ్రీనివాస్ కు ఉన్నంత క్రేజ్.. బల్మూరి వెంకట్ కు సైతం ఉంది. ఆయన్ను బరిలోకి దింపడం ద్వారా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేకపోయినా.. టీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతుండడం చర్చనీయాంశంగా మారింది.