
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులకు దమ్ముంటే తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న బిడ్డ అన్నారు. ధర్మం, న్యాయం కోసం దేన్నైనా త్యాగం చేసే బిడ్డ అని చెప్పుకున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కేసీఆర్ ఓడిపోతే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు మనం చెల్లించే పన్నుల నుంచే ఇస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు రేషన్ కార్డులు, పింఛన్లు ఉన్నాయన్న ఈటల.. ఇప్పుడు కూడా ఉంటాయన్నారు. గులాబీ జెండా కప్పుకుంటేనే పింఛన్, రేషన్ కార్డులు, దళిత బంధు పథకం వస్తుందని నీచపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ పథకాలన్నీ కేసీఆర్ తన భూములు అమ్మి ఇచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఈటల విమర్శించారు. హుజూరాబాద్ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయేనన్నారు. కేసీఆర్ భరతం పట్టేది హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలేనన్నారు. 2001లో టీఆర్ఎస్ పుడితే 2002లో తాను పార్టీలో చేరానని, కేసీఆర్ ఏది ఆదేశిస్తే ఆ పని చేశానని, అలాంటి తనను పట్టుకుని.. ‘మధ్యలో వచ్చి మధ్యలో వెళ్లాడు’ అంటారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చే వరకు ప్రాణాలకు తెగించి కొట్లాడామని, తమపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, జైళ్లలో మగ్గామని గుర్తు చేశారు. కేసీఆర్ ఒక్కనాడైనా జైలుకు వెళ్లాడా..? అని ప్రశ్నించారు.