
హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో నువ్వా? నేనా? అన్నట్టుగా తలపడుతున్న రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే ‘దళిత బంధు’ అమలుకు బ్రేక్ వేసిన ఎన్నికల సంఘం.. తాజాగా మరో బాంబు పేల్చింది. ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గంతోపాటు జిల్లా అంతటికీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులు హుజూరాబాద్ ఉప ఎన్నికకు సైతం వర్తిస్తాయని సీఈవో శశాంక్ గోయల్ స్పష్టత ఇచ్చారు.
ఈ మేరకు హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ తోపాటు హన్మకొండ పరిధిలోకి వస్తున్నందున.. రెండు జిల్లాల్లో కోడ్ అమలు కానుంది. కోడ్ దృష్ట్యా పక్క నియోజకవర్గాల్లో భారీ సభలకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న రాజకీయ పార్టీలకు ఈ అనూహ్య పరిణామం మింగుడు పడడం లేదు.
ఇప్పటికే ఈ నెల 27న హుజూరాబాద్ వెలుపల సీఎం కేసీఆర్ తో సభ నిర్వహించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అలాగే, బీజేపీ సైతం అమిత్ షా సభ నిర్వహణ కోసం ప్రణాళికలు రచిస్తోంది. తాజా నిబంధన నేపథ్యంలో ఈ రెండు సభలు దాదాపుగా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల వెనుక హుజూరాబాద్ నుంచి అందిన ఫిర్యాదులే కారణమని తెలుస్తోంది.
హుజూరాబాద్ లో పెద్ద సభలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు సమీపంలోని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాల పేరిట భారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కులాల వారీగా సమావేశాలు పెడుతున్నాయి. తాజా ఉత్తర్వులతో దీనికి అడ్డుకట్ట పడినట్టయింది.