
హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారం ప్రశాంతంగా జరిగింది. అయితే పోలింగ్ అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్లను తరలిస్తుండగా అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. హుజురాబాద్ నుంచి కరీంనగర్లోని ఓ కాలేజీకి ఈవీఎంలను తరలిస్తుండగా జమ్మికుంటలో బస్సులను అకస్మాత్తుగా ఆపేశారు. సమాచారం అందుకున్నకాంగ్రెస్ అభ్యర్థి బలమూరి వెంకట్, కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు .. అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. అయితే, అధికారులు దీనిపై వివరణ ఇస్తూ.. ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ తీసుకెళ్తున్న బస్సు టైర్ పంక్చర్ కావడం వల్లే కాసేపు ఆపాల్సి వచ్చిందని తెలిపారు. కానీ, ఈ విషయంలో గోల్ మాల్ జరిగినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి నడిరోడ్డుపై సెక్యూరిటీ లేకుండా వీవీప్యాట్స్ ను ఓ కారులోకి మార్చి తరలించినట్టుగా ఉంది.
ఈ పరిణామాలపై కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంలు తీసుకెళ్తున్న బస్సును కావాలనే మధ్యలో నిలిపివేశారని ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ తతంగంపై హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల అధికారి రవీందర్ రెడ్డి స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని పేర్కొన్నారు. ‘‘హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు పనిచేయని వీవీప్యాట్స్ ను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ పీజీ కళాశాల రిసెప్షన్ సెంటర్ రోడ్డులో ఒక అధికారిక వాహనం నుండి మరొక అధికార వాహనంలో గోదాంకు తరలించారు. ఈ సందర్భంగా అనుమానంతో ఓ వ్యక్తి వీడియో తీసి ఈ వీడియోను వైరల్ చేశాడు’’ అని తెలిపారు. ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు