
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రికి వాయుగుండంగా మారడంతో ఏపీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై- పుదుచ్చేరి తీరాలకు 170 కిలోమీటర్ల దూరం కేంద్రీకృతమైన వాయుగుండం గురువారం సాయంత్రానికి చెన్నై పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరాణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండగా.. కడప, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు వాన పడింది. కొన్నిచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. నెల్లూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, రాపూరు మండలాల్లో వర్షాలకు భారీగా పంట నష్టం సంభవించింది. నాయుడుపేట, సూళ్లూరుపేట, శ్రీహరికోట, తడతోపాటు చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, శ్రీ కాళహస్తి నియోజవర్గాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాలు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్లూరుపేట సహా మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారుల చెబుతున్నారని.. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బాధితుల కోసం ఏం కావాలన్నా వెంటనే అడగాలని.. శిబిరాల్లో వారికి మంచి ఆహారం అందించాలన్నారు. బాధితులకు రూ.వెయ్యి చొప్పున పరిహారం అందించాలని సీఎం సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలించేందుకు చర్యలు చేపట్టాలని.. అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవాలని జగన్ ఆదేశించారు.