
milled black pepper isolated on white background
మన దేశంలో ఎంతో పురాతన కాలం నుంచి ప్రజలు మిరియాలను వంటింటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ఆయుర్వేదంలో కూడా మిరియాలను ఉపయోగిస్తారు. మిరియాలు వంటలకు చక్కని రుచి తీసుకువస్తాయి. కొన్నిచోట్ల కారం పొడికి బదులుగా మిరియాలను కూడా వాడుతుంటారు. అయితే మిరియాలలో అనేక అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయని.. వాటితో పలు రోగాలను, సమస్యలను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మిరియాలతో బరువు తగ్గడం నుంచి జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చని పేర్కొంటున్నారు. మిరియాలను రోజూ తీసుకోవడం ద్వారా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మిరియాలతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరియాలలో కొవ్వును కరిగించే గుణాలున్నాయి. నాలుగైదు మిరియాలను తీసుకుని.. వాటిని తమలపాకుల్లో పెట్టుకుని నిత్యం నమిలి మింగాలి. అలా చేస్తే బరువు త్వరగా తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె, ఒక టీ స్పూన్ మిరియాల పొడిని కలిపి నిత్యం ఉదయాన్నే పరిగడుపున తాగాలి. అలా చేస్తే బరువు తగ్గవచ్చని పేర్కొంటున్నారు. బ్లాక్ పెప్పర్ ఆయిల్ ను కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఒక చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్ ను వేసి ఉదయాన్నే తాగితే.. శరీరంలోని మలినాలతో పాటు కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువును నియంత్రించవచ్చు. మిరియాల నీటిలో అల్లం రసం, తులసి ఆకులు, దాల్చిన చెక్క పొడి వేసి టీ లాగా తాగితే అధిక బరువు త్వరగా తగ్గవచ్చు. అంతేకాకుండా ఆహారంలో మిరియాలను ఉపయోగించినా కొవ్వు తగ్గుతుందట.