
మనలో చాలా మందికి పెరుగంటే ఇష్టం ఉంటుంది. ప్రతిరోజూ భోజనం ముగించే ముందు పెరుగన్నం కలుపుకుని తినడం సర్వ సాధారణం. అయితే పెరుగుతో కలిపి తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
– చాలామందికి పెరుగన్నంలో ఉల్లిగడ్డ ముక్కలను కలిపి తింటుంటారు. కానీ అలా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెరుగు శరీరంలో చల్లదనం పెంచుతుంది. అదే ఉల్లిగడ్డతో వేడి పెరుగుతుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తింటే అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, తామర, సోరియాసిస్, గ్యాస్ట్రిక్, వాంతులు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
– పెరుగు తిన్న వెంటనే మినపపప్పుతో చేసిన, లేదా నూనెలో దేవిన లేదా వెన్న, నెయ్యి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. దీనివల్ల జీర్ణక్రియ మందగించి బద్ధకం కలుగుతుంది.
– పెరుగు, చేపలు కలిపి తినొద్దు. ఎందుకంటే మాంసకృత్తులు అధికంగా ఉండే రెండు రకాల పదార్థాలు ఒకేసారి తినరాదని ఆయుర్వేదం చెబుతోంది. ఈ రెండింటిలో అధిక ప్రొటీన్లు ఉంటాయి. వీటిని కలిపి తింటే అజీర్ణంతో పాటు చర్మ సమస్యలు వస్తాయి.
– పెరుగుతో పాటు పాలను కలిపి తీసుకోకూడదు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. ఈ రెండింటినీ ఒకేసారి తీసుకుంటే ఎసిడిటీ, అతిసారం, కడుపునొప్పి, అజీర్తి వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
– పెరుగు తిన్న వెంటనే లేదా పెరుగుతో పాటు మామిడికాయ తినొద్దు. అలా తింటే శరీరంలో విషపదార్థాలు పెరుగుతాయి. ఫలితంగా ఎలర్జీలు, చర్మ సమస్యలు రావచ్చు.