
పనస పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించడంలో పనస పండు కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ఏపీలోని శ్రీకాకుళం మెడికల్ కాలేజీ, మహారాష్ట్రలోని పుణె మెడికల్ ఇన్ స్టిట్యూట్ ల సంయుక్త పరిశోధనలోనూ ఇదే విషయం వెల్లడైంది. షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో ఈ పండు బాగా పనిచేస్తుందని నిర్ధారించారు.
మధుమేహం ఉన్నవారు, ప్రీ-డయాబెటిస్ రోగులు తరచూ పనస పండును తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పనసను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గుతుందని కూడా వీరి పరిశోధనలో తేలింది. టైప్-2 డయాబెటిస్ ఉన్న 40 మంది రోగులతో వరి, గోధుమలకు బదులుగా పనస పిండితో చేసిన వంటకాలు నెలలపాటు తినిపించారు. కేవలం 7 రోజుల్లోనే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినట్లు గుర్తించారు.
ఆహారంలో పనసపొడిని కలుపుకుని తినడం వల్ల రక్తపోటును నివారించుకోవచ్చు. రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపర్చుకోవచ్చు. పనస పొడిలో ప్రోటీన్ కూడా ఎక్కువేనని వైద్యులు చెబుతున్నారు.