
చాలా మంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతుంటారు. నోరు పరిశుభ్రంగా లేకపోవటమే ఇందుకు కారణం కావచ్చు. రోజుకు కనీసం 2 సార్లు బ్రష్ చేయాలి. అలా చేస్తే నోటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. నోటి దుర్వాసన అనేది కొన్ని జబ్బులకు హెచ్చరిక సంకేతం లాంటిది. నోరు పరిశుభ్రంగా లేకపోతే దుర్వాసన వస్తుందని వైద్యులు చెబుతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇతర శారీరక వ్యాధులకు సంకేతం కావచ్చు. పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార ముక్కలు దుర్వాసన కలిగిస్తాయి. అంతే కాకుండా, పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు కూడా చాలాసేపు నోటి నుంచి అటువంటి వాసన వస్తుంది. సరిగా పళ్లు తోమనప్పుడు దంతాలలో చిక్కుకున్న ఆహార ముక్కలు పళ్ల వెనుక ఉండి పాచిలా మారవచ్చు. నోటిలోని బ్యాక్టీరియా ఆ ముక్కలను జీర్ణించుకుని హైడ్రోజన్ సల్ఫైడ్ను ఉత్పత్తి చేస్తుంది. లాలాజలం నోటిలో తేమను కాపాడుతూ, నోరు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ కొన్నిసార్లు, నోటిలో లాలాజల ఉత్పత్తి తగ్గడం వల్ల, మృతకణాలు నాలుక, చిగుళ్లు, బుగ్గల కింద పేరుకుని దుర్వాసన కలిగిస్తాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నోటి దుర్వాసన రావచ్చు. జీర్ణ సమస్యలు, క్యాన్సర్, శరీరంలోని ఇతర జీవక్రియల్లో అవాంతరాలు కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. ధూమపానం, డైటింగ్, ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం, నోటి పూత, చిగుళ్లలో రక్తస్రావం, నోటిలో పుండ్లు, గవద బిళ్లలు, శరీరంలో జింక్ తగ్గడం వంటివి కూడా నోటి దుర్వాసనకు దారితీస్తాయి. సమస్య అలాగే కొనసాగుతుంటే, వైద్యుడిని సంప్రదించాలి.