
హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది, ఇక పార్టీలన్నీ ఒకరిపై ఒకరు విమర్శలకు ఎక్కు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఈటెల అనే రీతిలో నువ్వా నేనా అన్నట్లు మాటలు తూటాలు పేలుతున్నాయి. మంత్రి హరీష్ రావు తన మాటల్లో దూకుడు పెంచారు. మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల మాట్లాడుతున్న మాటలు హుజూరాబాద్ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు.
కేసీఆర్ ఈటెల ను ‘ ఈటెల నా తమ్ముడు, నా కుడి భుజం’ అని అంటే ఈయనేమో కెసిఆర్ కె ఘోరీ కడతా అని ఈటల అనడం ఏం సంస్కృతి? అని హరీశ్ రావు మండిపడ్డారు. ఈటెలకు అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి తెచ్చింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను గెలిపించాలని, మిగిలిన రెండున్నరేళ్లు గెల్లు శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ‘శ్రీనివాస్ తో పాటు మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి… అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం’ అన్నారు మంత్రి హరీశ్.