
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి అచ్చేదిన్ వస్తాయని ఊదరగొట్టారని, కానీ, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అచ్చేదిన్ పోయి సచ్చేదిన్ వచ్చిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రి హరీశ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి ఈటల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది సరికాదని ఆయన అన్నారు. ఇప్పటికైనా నియోజకవర్గ ప్రజలు ఈటల మోసాలు గుర్తించాలని , ప్రజలు బాగుపడాలా, ఈటల బాగుపడాలా అనే విషయం ఆలోచించాలని మంత్రి హరీశ్ కోరారు. బీజేపీ అమ్మకానికి, నమ్మకానికి టీఆర్ఎస్ మరో రూపమని ఆయన అన్నారు. రైళ్లు కూడా అమ్మితే, సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని మంత్రి హరీశ్ జోస్యం చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం మంత్రి హరీశ్ ప్రచారం చేస్తున్నారు.