
ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో దళిత, గిరిజన దండోరా సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గజ్వేల్ పట్టణమంతా కను చూపు మేరలో కాంగ్రెస్ జెండాలే కనిపించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గజ్వేల్ అంతా జై కాంగ్రెస్ నినాదమే వినిపించాలని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు పొరుగున్న ఉన్న మేడ్చల్, నల్లగొండ, యాదాద్రి, జనగామ జిల్లాల నుంచి జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రేవంత్ కు సన్నిహితులైన వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రాజయ్య, షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే సీతక్క అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై జరుగుతున్న దౌర్జన్యాలను నిరసిస్తూ గజ్వేల్ సభలో ప్రజా చార్జిషీట్ ను కాంగ్రెస్ నేతలను విడుదల చేయనున్నారు. గతంలో సీఎం కేసీఆర్ హమీ ఇచ్చి.. ఇంకా నెరవేరని అంశాలను సైతం అందులో ప్రస్తావించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కమిటీ ని ఏర్పాటు చేశారు. ఈ సభకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియమితులయ్యాక నాలుగు చోట్ల దండోరా సభలు నిర్వహించారు. ఆయా సభలకు కార్యకర్తలు భారీగా హాజరు కావడం ఆ పార్టీ వర్గాల్లో జోష్ నింపింది. ఈ సారి సీఎం నియోజకవర్గంలో భారీ సభ నిర్వహించేందుకు టీపీసీసీ ప్రణాళిక రచించింది.