
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచాక సుదీర్ఘ విరామం అనంతరం బరిలోకి దిగిన తొలి టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరో టోర్నీకి సిద్ధమైంది. ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీకి సన్నద్ధమైంది. డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో నిరాశపరిచిన సింధు.. ఫ్రెంచ్ ఓపెన్ లో టైటిల్ పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో జూలీ జాకోబ్ సెన్ (డెన్మార్క్)తో మూడో సీడ్ సింధు తలపడుతుంది.
సింధుతో పాటు మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ పోటీ పడుతుండగా.. పురుషుల విభాగంలో శ్రీకాంత్, సాయిప్రణీత్ బరిలో ఉన్నారు. సైనా నెహ్వాల్ తొలి రౌండ్లో సయాక తకహాషి (జపాన్)తో పోటీపడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ కెంటొ మొమొట (జపాన్)తో శ్రీకాంత్, లక్ష్యసేన్ తో సాయిప్రణీత్, జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)తో సమీర్ వర్మ, బ్రైస్ లెవెర్ దెజ్ (ఫ్రాన్స్) తో పారుపల్లి కశ్యప్ తలపడతారు.