
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయల్లో జరుగుతున్న ఈ దందాకు సంబంధించి ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? వాటి చెల్లింపులు ఏవిధంగా చేశారు? డ్రగ్స్ కొనుగోలు నిమిత్తం విదేశాలకు ఎంత డబ్బు మళ్లించారు? అంత డబ్బు ఎక్కడిది? వంటి అంశాలపై ఈడీ విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుడు కెల్విన్ కు అంతర్జాతీయ మత్తు మందుల ముఠాతో సంబంధాలు ఉన్నట్టు దర్యాప్తులో తేలింది. అమెరికా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకున్నట్టు విచారణలో వెల్లడించినట్టు సమాచారం. ఎల్ఎస్డీ, కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ ను దిగుమతి చేసుకున్నట్టుగా దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసి ఆన్ లైన్ ద్వారా డబ్బులు చెల్లించినట్టు అధికారులు గుర్తించారు. కొరియర్ ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకొన్నారని అధికారులు చెబుతున్నారు. మూడు ప్రైవేట్ కొరియర్ సంస్థలతో పాటు తపాలా ద్వారా కూడా డ్రగ్స్ సరఫరా అయ్యేవని, వాటి చెల్లింపులు ఎక్కువగా బిట్ కాయిన్ రూపంలోనే జరిగేవని సమాచారం. కాగా, డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ నటీనటులను మరో మారు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయా తేదీల్లో వారిని విచారణ జరపనుంది.