
అనుకున్నదే జరిగింది… కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్బుక్’ పేరు మారింది. ఈ విషయాన్ని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా వెల్లడించారు. ఫేస్బుక్ కంపెనీ పేరును ‘మెటా’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై కంపెనీ స్టాక్స్ అన్నీ కొత్త సింబల్ MVRS తో ట్రేడ్ అవుతాయని తెలిపారు. MVRS అంటే మెటావర్స్ (metaverse). మెటావర్స్ అంటే ప్రజలు కలుసుకునే వర్చువల్ రియాలిటీ స్పేస్ అని అర్థం. దీనికి సంబంధించిన కొత్త లోగోను గురువారం కంపెనీ కనెక్ట్ ఈవెంట్లో ఆవిష్కరించారు. ఫేస్బుక్ కింద ఇంతకాలం కొనసాగిన సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లు ఇకపై ‘మెటా’ కింద కొనసాగుతాయి.
పేరు మార్పు వెనుక భారీ ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకుంది ఫేస్బుక్. వచ్చే ఐదేళ్లలో యూరప్ మార్కెట్‌ను శాసించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో పాటు సాధ్యమైనంత త్వరగా మెటావర్స్‌ను బిల్డ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెటావర్స్‌లోనే ఆగ్మెంటెడ్ రియాల్టీ, వర్చువల్ రియాల్టీ, ఆన్లైన్ గేమింగ్ ఉండనున్నాయి. వీటి మీదనే కంపెనీ భవిష్యత్ ఆధారపడి ఉందని చెబుతోంది ఫేస్బుక్. ఇప్పటికే మెటావర్స్‌పై జుకర్ బెర్గ్ వివరణ ఇచ్చారు. రాబోయే రోజుల్లో చాలా ప్రభావవంతంగా పనిచేయబోతోందని చెప్పారు. మెటావర్స్… మొబైల్ ఇంటర్నెట్ను శాసిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రెండు నెలలు శ్రమించి కంపెనీ పేరు మెటావర్స్‌గా మార్చారు.
ఇక నుంచి ఫేస్బుక్ పేరు వింటే మెటావర్స్ కంపెనీ గుర్తుకువస్తుందని చెబుతున్నారు. ఇక, ప్రైవసీ, సేవల్లో అంతరాయాలు వంటి అంశాలపై ఫేస్బుక్ తీవ్ర విమర్శలపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కంపెనీపై వస్తున్న ఆరోపణలు, కంపెనీ ఎదుర్కొంటున్న వివాదాలపై ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని టెక్ విశ్లేషకులు అంటున్నారు. ఇదోరకరమైన గిమ్మిక్ అంటున్నారు.