
తెలంగాణ రాష్ట్ర మంత్రి, మాజీ మంత్రి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తెలంగాణ మంత్రి హరీశ్ రావు, మాజీ మంత్రి ఈటెల మాటల పోటీలో నువ్వా నేనా అనే రీతిలో వ్యవహరిస్తున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు. కాగా, మాజీ మంత్రి ఈటెల, తెలంగాణ మంత్రి హరీశ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు ఒక రబ్బరు స్టాంప్ వంటివారిని అన్నారు. తాను సీఎం కావాలని అనుకున్నానని హరీశ్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పారు. ఈ విషయాన్ని హరీశ్ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలని అన్నారు.
తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేయలేదని, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేయాలని చెబితే చేశానని ఈటెల తెలిపారు. హరీశ్ కు ఆయన మామ కేసీఆర్ ఉన్నారని, ఆయన లాగ తాను వారసత్వంతో రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. అడుగులకు మడుగులు ఒత్తే వారికి ప్రగతి భవన్ లోకి ఎంట్రీ ఉంటుందని అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక కేవలం రిహార్సల్ మాత్రమేనని చెప్పారు.